- పది మందికి గాయాలు
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులోని శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో భాగంగా బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన అగ్నిగుండంలో పడి పది మంది మహిళలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
హోలీ సందర్భంగా బుధవారం ఉదయం గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారి పల్లకి అగ్నిగుండం దాటగా.. తర్వాత వెనుక ఉన్న భక్తులు దాటేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో తోపులాట జరగడంతో పలువురు మహిళలు అగ్నిగుండంలో పడిపోయారు. అక్కడే ఉన్న వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్యతో పాటు పోలీస్ సిబ్బంది స్పందించి వారిని బయటకు లాగారు. అనంతరం చికిత్స కోసం మిర్యాలగూడలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
