న్యూఢిల్లీ: బజాజ్ గ్రూప్ హెల్త్‌కేర్ రంగంలోకి అడుగుపెడుతోంది. రాబోయే మూడేళ్లలో పుణెలో రూ.2,500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. పదేళ్లలో12 ప్రధాన నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్పత్రులు, హోమ్ కేర్, ఆంబులెన్సు సర్వీసులు, అత్యాధునిక ఆసుపత్రులతో కూడిన సమగ్ర విధానాన్ని అమలు చేయనున్నారు.
పుణెలో 450 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఇప్పటికే బజాజ్ గ్రూప్ స్వచ్ఛంద సంస్థల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, ఇప్పుడు వాణిజ్యపరంగా విస్తరిస్తోంది.
ముంబైలోనూ ఆస్పత్రులను కడతారు. ఆస్తుల కొనుగోలు కంటే సొంతంగా కొత్త మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించనున్నారు. భారత్ గర్వపడేలా ఆరోగ్య సేవలను అందించడమే తమ లక్ష్యమని బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు.
