- సింగరేణి ఆస్తుల విధ్వంసం చేయాలనే కేసులో బీఎన్‌ఎస్ 152 సెక్షన్ చేర్చిన పోలీసులు
- రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఆస్తులు, రైలు పట్టాలను ధ్వంసం చేయాలని ప్రజలను రెచ్చగొట్టిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఉచ్చు బిగుస్తోంది. మిలిటెంట్ల తరహాలో విధ్వంసానికి పిలుపునివ్వడంతో ఐదు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నాంపల్లి పోలీసులు.. విచారణ అనంతరం ‘రాజద్రోహం’ కింద 152 బీఎన్‌ఎస్ సెక్షన్ సైతం జోడించారు. ఈ మేరకు బాల్క సుమన్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు.
భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా బాల్కసుమన్ వ్యాఖ్యలు ఉన్నట్లు తెలిపారు. కాగా, పాత ఐపీసీ రాజద్రోహ చట్టం (సెక్షన్ 124 ఏ) స్థానంలో సెక్షన్ 152 బీఎన్‌ఎస్‌ను పేర్కొంటూ కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే జీవిత ఖైదు లేదా ఏడేండ్ల జైలు శిక్ష, జరిమాన విధించే అవకాశాలు ఉంటాయి. ఈ కేసులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాల్క సుమన్‌ను రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
మిలిటెంట్ల తరహా దాడులు..
బాల్క సుమన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. సింగరేణి ఆస్తులకు నిప్పుపెట్టాలనే వ్యాఖ్యలకు సంబంధించి సెక్షన్ 326(జీ) సహా తీవ్రమైన నేరాలకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర, ప్రజాఆస్తుల నష్ట నివారణ చట్టంలోని ప్రజా ఆస్తుల విధ్వంసం కింద పలు సెక్షన్లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మిలిటెంట్ తరహాలో దాడులు చేయాలన్న వ్యాఖ్యలపై రాజద్రోహం కింద 152 బీఎన్‌ఎస్ సెక్షన్ అదనంగా చేర్చారు.
కాగా, ప్రజా శాంతిభద్రతలు కుప్పకూలకుండా నివారించడానికి, జాతీయ మౌలిక సదుపాయాలను కాపాడటాడంతో పాటు పౌరుల ప్రాణాలను రక్షించడానికి బాల్క సుమన్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు. తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో బాల్క సుమన్‌కు అంత సులువుగా బెయిల్ లభించే అవకాశాలు లేవని న్యాయనిపుణుల అభిప్రాయపడుతున్నారు.
