జూనియర్ లైన్ పరీక్షల్లోనూ అవకతవకలు.. కీసరలో ఒకే సెంటర్లో 92 మంది పాస్

జూనియర్ లైన్ పరీక్షల్లోనూ అవకతవకలు.. కీసరలో  ఒకే సెంటర్లో 92 మంది పాస్

టీఎస్పీఎస్సీ పరీక్షల్లోనే కాదు..ఇతర బోర్డుల పరీక్షల్లోనూ అవకతవకలు జరిగాయని ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎస్పీడీసీఎల్ బోర్డు పరిధిలోని జూనియర్ లైన్ మెన్ పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీలో  డీఈ  రమేష్ ప్రమేయం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారని..అయితే రమేష్ పేపర్ లీక్ చేసింది టీఎస్పీఎస్సీలోనా..లేక ఎస్పీడీసీఎల్ లోనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరీక్షలను సక్రమంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. పేపర్ లీకేజ్ అయినా.. మాస్ కాపీయింగ్  అయినా బయటపెట్టకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారని చురకలంటించారు. 

ఒకే సెంటర్లో ఎక్కువ మంది పాస్..

ఎస్పీడీసీఎల్ బోర్డు పరిధిలో జులై 17వ తేదీన  జూనియర్ లైన్ మెన్ పరీక్షలుజరిగాయని..ఫిబ్రవరి 2 2023లో మరో నోటిఫికేషన్ ఇచ్చారని బల్మూరి వెంకట్ గుర్తు చేశారు. మొత్తం 1755 జూనియర్ లైన్ మెన్ పోస్టులకు 60 వేల మంది దరఖాస్తు చేసుకుంటే 50 వేల మంది పరీక్షలు రాశారని చెప్పారు.  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కీసర గీతాంజలి సెంటర్లో  700 మంది జూనియర్ లైన్ మెన్ పరీక్ష  రాస్తే..అందులో 92 మంది పాస్ అయ్యారని బల్మూరి వెంకట్ వెల్లడించారు. గీతాంజలి సెంటర్లో మొదటి బ్లాక్ లోనే  92 మందికి 40 మార్కులకు పైగా వచ్చాయని చెప్పారు. ఈ అక్రమాలు బయటపడకుండా ఓటీపీ సిస్టమ్ తీసుకొచ్చారని.. .డీఈ రమేష్ అక్రమాలు బయటపడటంతో హడావుడిగా  జూనియర్ లైన్ మెన్ ల ఫలితాలు వెల్లడించారని ఆరోపించారు. అన్ని బోర్డులకు లింకులు బయటపడతాయని తెలంగాణ సర్కార్ భయపడుతోందని విమర్శించారు. ఎస్పీడీసీఎల్ లోని అవకతవకలు జరిగినా బయటపెట్టడం లేదని ఆరోపించారు. పేపర్ లీకేజీ అంశాన్ని టీఎస్పీఎస్సీకే పరిమితం చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.