- యూట్యూబ్ చానళ్ల ముసుగులో సనాతన ధర్మంపై దాడి :
- కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం, బూతు ప్రచారాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు స్పష్టమైన నియంత్రణ ప్రాతిపదికన ఒక ‘లక్ష్మణరేఖ’ విధించడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
యూట్యూబ్ చానళ్ల ముసుగులో కొందరు అర్బన్ నక్సల్స్ సనాతన ధర్మం, హైందవ సంస్కృతిపై విషపూరిత దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిజం పేరుతో యూట్యూబ్ చానళ్ల ద్వారా విష ప్రచారం నిర్వహిస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాల ఉదాసీనత వల్ల సమాజానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో విద్వేషాలు చల్లే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పవన్ ఆరోగ్యంపై ఆరా..
ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని సంజయ్ అడిగి తెలుసుకున్నారు.
