- రాహుల్, రేవంత్ మహిళా ద్రోహులు: కేంద్ర మంత్రి బండి సంజయ్
- మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కూటమి విషం కక్కిందని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: మహిళలకు మేలు చేసేలా తెచ్చిన మూడు బిల్లులు నెగ్గకపోవడం... దేశ ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం 131 సవరణ బిల్లు వీగిన అనంతరం మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. రాహుల్, రేవంత్ ముమ్మాటికీ మహిళా ద్రోహులని, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కూటమి కాలకూట విషం కక్కిందిదని ఫైర్అయ్యారు.
మహిళలందరినీ ఓడించినందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి సంబురాలు చేసుకుందని అన్నారు. ప్రతి తల్లి, అక్కా, చెల్లి ఇలా అందరికీ ఇది అవమానకరమైన రోజు అని అభివర్ణించారు. త్వరలోనే మహిళలంతా కలిసి కాంగ్రెస్ కూటమిని ఓడించే రోజులు రాబోతున్నాయని హెచ్చరించారు. డూప్లికేట్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా?’అని ప్రశ్నించారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే కాంగ్రెస్, పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర!
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజీ రావొద్దని రాత్రికి రాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఫోన్లో మాట్లాడుకుని కుట్రలకు తెరలేపారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక కాంగ్రెస్, పదేండ్ల పాలనలో తమ అవినీతి బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలు రోజుకో అంశాన్ని వివాదం చేస్తున్నారని మండిపడ్డారు.
లోక్ సభలో ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను తేజస్వి దేశభక్తులతో పోల్చారని, దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వివాదం చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలవల్లే వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానం చేసుకున్నారనే ఈ అంశాన్ని ఎంపీ ప్రస్తావించారే తప్ప.. తెలంగాణను అవమానించలేదని వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని విమర్శించారు. ‘నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తాను’ అని ఒకరికొకరు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు.

