
హైదరాబాద్,వెలుగు: గురుకులాల్లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలు రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. పలు పోస్టులకు వేలాదిమంది నిరుద్యోగులు పోటీపడ్డారని, వారిలో 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసి, రిక్రూట్ మెంట్ చేశారని గుర్తుచేశారు.
డిసెండింగ్ ఆర్డర్ విధానంలో జరిగితే వివిధ రకాల క్యాడర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పెద్ద క్యాడర్ ఉద్యోగాలను ఎంపిక చేసుకునే వారని చెప్పారు. దీంతో మిగతా కేడర్ ఉద్యోగాలకు రిలింక్విష్ మెంట్ లెటర్ ఇవ్వడంతో ఒక అభ్యర్థి పలు ఉద్యోగాలకు ఎంపికైనా కూడా ఆ స్థానాలు ఖాళీగా ఉండకుండా తర్వాతి మెరిట్ అభ్యర్థులతో నింపేవారని పేర్కొన్నారు. తద్వారా మెరిట్ అభ్యర్థి నష్టపోకుండా ఉద్యోగ అవకాశం దక్కుతుందన్నారు. అలాకాకుండా డిసెన్డింగ్ ఆర్డర్ విధానంలో భర్తీ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పారు.
కాబట్టి, ప్రభుత్వం గతంలో మాదిరిగా డిసెండింగ్ ఆర్డర్ విధానంలో నియామక ప్రక్రియ చేపట్టి రిలింక్విష్ మెంట్ విధానంలో ఖాళీలు ఏర్పడకుండా మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇస్తూ నియామకం చేపట్టారో, అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధానంలో నియామక ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.