కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ లకు గాడిద గుడ్డే : బండి సంజయ్

కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ లకు గాడిద గుడ్డే : బండి సంజయ్
  •     బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి 500 కోట్లు తెస్తా: బండి సంజయ్
  •     హుజూరాబాద్, జమ్మికుంట రూపురేఖలు మారుస్తా
  •     బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి దొంగ హామీలు ఇవ్వమని వ్యాఖ్య

జమ్మికుంట/ కరీంనగర్/ హుజూరాబాద్‌‌ రూరల్‌‌, వెలుగు:  రెండేండ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. గురువారం హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్స్‌‌లో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.500 కోట్ల నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో కేంద్రం ఇటీవల రూ.259 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. 

‘‘హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే.. ఢిల్లీకి పోయి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి, రెండు పట్టణాల రూపురేఖలు మారుస్తా. హుజూరాబాద్‌‌లో మినీ స్టేడియం, జమ్మికుంటలో నాయిని చెరువు మినీ ట్యాంకుబండ్‌‌గా సుందరీకరణ, జమ్మికుంటను కూరగాయల హబ్‌‌గా మార్చడంతో పాటు కరీంనగర్ తరహాలో జమ్మికుంట రైల్వే స్టేషన్‌‌ను ఆధునీకరించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తాం. 

లోతట్టు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్, అంబేద్కర్ కాలనీ, కృష్ణ కాలనీ ఏరియాల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం. అంగన్‌‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు పీఎం ఆవాస్ యోజన నిధులను తీసుకొచ్చి పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం” అని హామీ ఇచ్చారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను దోచుకుంటున్నది. కానీ మేం ఆ పార్టీల మాదిరిగా దొంగ హామీలు ఇవ్వం” అని అన్నారు.  

బీజేపీ అభ్యర్థులతో ప్రమాణం.. 

14, 15వ ఆర్థిక సంఘం ద్వారా హుజూరాబాద్‌‌కు రూ.19.57 కోట్లు, జమ్మికుంటకు రూ.8.23 కోట్లు మంజూరు చేయించినట్టు సంజయ్ తెలిపారు. ఈ రెండు పట్టణాలకు అమృత్ పథకం కింద రూ.49.25 కోట్లు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ.6.50 కోట్లు మంజూరు చేయించినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు 20 వేలకు పైగా సైకిళ్లను ఉచితంగా అందజేయడంతో పాటు వార్షిక పరీక్ష ఫీజులను సైతం చెల్లించినట్టు పేర్కొన్నారు. 

అనంతరం గెలిచిన తర్వాత ఏ పార్టీల్లోకి వెళ్లబోమని బీజేపీ అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. ఈ మీటింగ్స్‌‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎన్నికల ఇన్‌‌చార్జ్ ఎర్ర మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌‌‌‌కు 1,400 కోట్లు ఎప్పుడిచ్చారు? 

రెండేండ్ల పాలనలో కరీంనగర్‌‌‌‌కు రూ.1,400 కోట్లు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సీఎంకు నిజంగా దమ్ముంటే.. ఆ నిధులు ఎప్పుడు ఇచ్చారు? ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు? అనే వివరాలతో వైట్‌‌ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కరీంనగర్ బొమ్మకల్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌‌లో సంజయ్ మాట్లాడారు. తనను కోసినా నయాపైసా లేదని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ‘‘అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. 

పైగా కేంద్రాన్ని నిందించడం విచిత్రంగా ఉంది. కేసీఆర్ ఇచ్చే మూటలు ఢిల్లీకి పంపి.. సీఎం సీటు కాపాడుకుంటున్నారా? అందుకే ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారా? మా భుజం మీద తుపాకీ పెట్టి ఇతరులను కాలుద్దామంటే.. ఆ ట్రాప్‌‌లో ఇరుక్కోవడానికి మేం సిద్ధంగా లేం. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం” అని అన్నారు. డంపింగ్ యార్డు తరలింపుకు కేంద్రం రూ.50 కోట్లు, చెత్త బయో మైనింగ్ కోసం మరో రూ.18 కోట్లు విడుదల చేసినా... ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుంటోందని సంజయ్​ మండిపడ్డారు.