పేదోళ్లకు సేవకులవ్వండి

పేదోళ్లకు సేవకులవ్వండి

హైదరాబాద్, వెలుగు: లాక్‌‌డౌన్‌‌టైమ్‌‌లో పేదలకు సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని పార్టీ నేతలు, క్యాడర్‌కు బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్‌ దిశానిర్ధేశం చేశారు. ఈ విపత్కర సమయంలో తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలన్నారు. బీజేపీ కార్యకర్తలంటే పేదలకు సేవా వాలంటీర్లనే భావం కలగాలని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్రపార్టీ కార్యాలయం నుంచి నేతలతో టెలికాన్ఫరెన్స్‌‌లో సంజయ్ మాట్లాడారు.  అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, బీజేపీ జిల్లా ఇన్‌‌చార్జులు, రాష్ట్ర కోర్  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు, సిటీలో బూత్ స్థాయిలో ప్రోగ్రామ్స్‌‌ను కొనసాగించాలని నేతలు, కార్యకర్తలకు సంజయ్‌ సూచించారు. లాక్‌‌డౌన్ పొడిగించే అవకాశాలున్నందున రాబోయే రోజుల్లోపేదలను ఆదుకునే కార్యక్రమాలకు ప్లాన్ చేయాలన్నారు.

కేంద్ర పార్టీ కూడా రాష్ట్రంలోని సేవా కార్యక్రమాలపై ఆరా తీస్తోందని.. కాబట్టి రోజూ పేదలకు అన్నదానం, బియ్యం పంపిణీ, నిత్యావసర సరకులను అందించాలని చెప్పారు. తాము ఓ పూట ఉపవాసం ఉండైనా పేదల కడుపు నింపడంలో ముందుండాలని, జాతీయ పార్టీ కూడా ఇదే ఆదేశించిందని గుర్తుచేశారు.

సర్కారుపై ఒత్తిడి తేవాలి

రాష్ట్రంలో రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాళ్లకు  సాయం చేయడంపై దృష్టి పెట్టాలని నేతలు, క్యాడర్‌ను సంజయ్ కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఆసరా కావాలన్నారు. అకాల వర్షాలు, వడగళ్లవానలతో పంట నష్టపోయిన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వంనుంచి న్యాయం జరిగేలాకా ర్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బత్తాయి, నిమ్మ రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలా ఒత్తిడి తెచ్చే పోగ్రామ్  చేయాలని కోరారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో గురువారం సాయంత్రం సంజయ్‌ భేటీ అయ్యారు. తర్వాత హైదరాబాద్సిటీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని హైదరాబాద్ సిటీ నేతలను కోరారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభు త్వంపై ఒత్తిడి తీసుకురావాలని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నేతలకు చెప్పారు. బీజేపీ నేత లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మంత్రి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.