కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. ఖబర్దార్‌‌‌‌‌‌‌‌..నా జోలి కొస్తే బజారు కీడుస్తా : బండి సంజయ్‌‌‌‌

కేటీఆర్‌‌‌‌‌‌‌‌.. ఖబర్దార్‌‌‌‌‌‌‌‌..నా జోలి కొస్తే బజారు కీడుస్తా :  బండి సంజయ్‌‌‌‌
  •     మా కార్యకర్తలను కొట్టి జైలుకు పంపుతవా? బిడ్డా.. నీ సంగతి చూస్తా: బండి సంజయ్‌‌‌‌
  •     కేంద్ర నిధులను మింగి సిరిసిల్లను వరదల్లో ముంచిండు
  •     సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ‘‘బీఆర్ఎస్ కారు పూర్తిగా ఖరాబైంది.. ఇంటర్నేషనల్ మెకానిక్ వచ్చినా దానిని రిపేర్‌‌‌‌‌‌‌‌ చేయలేరు. అందుకే కేసీఆర్ ఫాం హౌస్‌‌‌‌కే పరిమితమైండు’’అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఖబర్దార్.. నా జోలికొస్తే బజారుకీడుస్తా.. మా కార్యకర్తలను కొట్టి జైలుకు పంపుతవా? బిడ్డా.. నీ సంగతి చూస్తా.. మళ్లీ నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బండారం అంతా బయటపెడతా.. అని హెచ్చరించారు. 

తనకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నడని, ఆ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయాలని కోరారు. మొన్నటిదాకా సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్‌‌‌‌కు అప్పగిస్తే కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ మింగి సిరిసిల్లను వరదల్లో ముంచాడని విమర్శించారు. వస్త్ర పరిశ్రమ మొత్తం సిరిసిల్లలో ఉంటే యారన్ డిపోను వేములవాడలో పెడతారా అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం..

ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ రాజకీయ వ్యభిచారం చేస్తోందని సంజయ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవని స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ‘‘స్పీకర్ సార్.. మీరు నిజాయితీపరులు. మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీ భవన్‌‌‌‌లోనే సంసారం చేస్తున్నరు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్‌‌‌‌లు పెడతారు. వాళ్ల చేతికే బీఫామ్‌‌‌‌లు ఇస్తరు. కండ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణం”అని మండిపడ్డారు.

అవకాశం ఇస్తే కేంద్ర నిధులతో అబివృద్ది చేస్తా..

మున్సిపాలిటీల్లో బీజేపీకి అధికారం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి, సిరిసిల్ల, వేములవాడను అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఎములాడకు 14, 15 ఆర్థిక సంఘం ద్వారా రూ.16 కోట్లు సాంక్షన్ చేయించానని గుర్తుచేశారు. సిరిసిల్ల జిల్లాలోని పేద విద్యార్థులందరికీ 20 వేల సైకిళ్లు పంపిణీ చేశానని, టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించానని చెప్పారు. వేములవాడలో ఆగమన శాస్త్ర సంప్రదాయాలను పాటించకుండా అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. రాతితో కట్టాల్సిన కట్టడాలను సిమెంట్‌‌‌‌తో కడుతున్నారని మండిపడ్డారు.