జూబ్లీహిల్స్, వెలుగు: తెలంగాణ భవన్ వద్ద పోలీసులను అడ్డుకుని, విధి నిర్వహణకు ఆటంకం కలిగించిన ఘటనలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు శనివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ వద్దకు పోలీసులు వెళ్లారు.
ఈ సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన రహదారి వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు దశరథ్, శ్రీనివాస్ నాయుడు, తుంగ బాలు, విద్యాసాగర్, హరిబాబు, ప్రశాంత్ గౌడ్, క్రాంతి తదితరులు పోలీసులను చుట్టుముట్టి తోపులాటకు దిగారు.
పోలీసులను అడ్డుకుని, విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు సృష్టించారని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
