- జబల్‌పూర్ పడవ ప్రమాదంలో మృతులు 9 మంది
జబల్‌పూర్ (మధ్యప్రదేశ్): బార్గి డ్యామ్‌లో పడవ ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా ఇంకా ఆరుగురి ఆచూకీ దొరకలేదు. నదిలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం వెలికి తీసిన ఐదుగురి మృతదేహాలతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ విషాద ఘటనలో మరణించిన వారిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
బోటు ప్రమాదానికి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన వీడియో అక్కడ జరిగిన భద్రతా లోపాలను కళ్లకు కడుతోంది. ప్రయాణికులకు ఇవ్వాల్సిన లైఫ్ జాకెట్లు ప్రమాద సమయానికి ఇంకా ప్లాస్టిక్ కవర్లలో సీల్ చేసే ఉన్నాయి. పడవలో నీరు చేరడంతో భయాందోళనకు గురైన పర్యాటకులకు వాటిని బయటకు తీసి ధరించడం సాధ్యం కాలేదు. పడవలోకి వేగంగా నీళ్లు వస్తుండడంతో పర్యాటకులు కేకలు వేయడం వీడియోలో రికార్డ్ అయ్యింది.
ఈ ప్రమాదంలో గల్లంతైన వారిని గుర్తించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి, అధునాతన పరికరాలతో నది అంచులను, లోతైన ప్రాంతాలను గాలిస్తున్నారు. నది ప్రవాహం, నీటి అడుగున పేరుకుపోయిన బురద, గుర్రపుడెక్క గాలింపు చర్యలకు పెద్ద సవాల్‌గా మారాయి. కాగా, తమ వారు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశతో నదీ తీరంలో పడిగాపులు కాస్తున్న బాధితుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పడవ నడిపే సమయంలో భద్రతా నియమాలు పాటించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని సీఎం మోహన్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
