ఖైరతాబాద్/ ముషీరాబాద్/ కుషాయిగూడ / హైదరాబాద్ / సికింద్రాబాద్/: గ్రేటర్ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు, దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం గాంధీనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి హాజరయ్యారు. మహిళలతో కలిసి విజయశాంతి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే సంవత్సరం బతుకమ్మ పండుగ వరకు శత్రునాశనం జరిగి రాష్ట్రంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆటపాటలతో, డప్పు, దరువు, గాజుల సప్పుళ్లతో సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. ఆదివారం చర్లపల్లి చెరువు డివిజన్లోని మహిళలతో కలిసి వెన్న ముద్దల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా జర్నలిస్టులతో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడారు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి కవిత ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లి మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మలు పేర్చారు.
ఆపై బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ కలిసి ఆడారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రావు, వనజ, రాజేశ్, హరి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి కంసాలీ బజార్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక , బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బన్సీలాల్ పేట చౌరస్తాలో యువశక్తి ఆటోడ్రైవర్స్ వెల్ఫేర్అసోసియేషన్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..‘‘ఆటో డ్రైవర్లు శ్రమ జీవులని, అమ్మ ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ ఇన్‌చార్జ్ టి.రాజశేఖర్ రెడ్డి, నాయకులు సునీల్, ఎల్లకొండ శ్రీనివాస్, విజయ్ కుమార్, రామ్మోహన్, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
