హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం (బీసీఐఎఫ్) ఫౌండర్ ప్రెసిడెంట్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. గురువారం హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్‌లో బీసీఐఎఫ్ రెండో వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఈ వేడుకలో సంస్థ జెండా, కండువా, లోగోలతో పాటు వచ్చే నెల 9న నల్గొండలో నిర్వహించనున్న 'బీసీ సామాజిక న్యాయ పోరాట సభ' పోస్టర్లను చిరంజీవులు ఆవిష్కరించారు.సమావేశంలో సంస్థ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, గ్రామస్థాయి వరకు సంస్థను బలోపేతం చేయాలని నిర్ణయించారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి బీసీఐఎఫ్ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని తీర్మానించారు.బీసీఐఎఫ్‌ను రాజకీయ పార్టీగా మార్చాలనే అంశంపై చర్చ జరిగినప్పటికీ, మరిన్ని విస్తృత సంప్రదింపులు అవసరమని భావించి ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కేవలం భావజాల ప్రచారానికే పరిమితం కాకుండా, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరస్వామి, వైస్ చైర్మన్ బెనర్జీ, సూరగోని రమేష్, కూరపాటి రమేష్‌తో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
