- 10 వేల ర్యాంకు నిబంధన ఎత్తివేయాలి: బీసీ జేఏసీ నేతలు
సైఫాబాద్, వెలుగు: ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రతీ బీసీ విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని మినిస్టర్స్క్వార్టర్స్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అమలు చేస్తున్న 10 వేలలోపు ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలని కోరారు. ర్యాంకు ఆధారంగా పరిమితులు విధించడం వల్ల వేలాది మంది బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
జనగణనలో బీసీ, ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఉండాలి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, కులాల వారీగా సమగ్ర సమాచారాన్ని సేకరించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ సాధన జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి కోరారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. జనగణనలో బీసీ, ఓబీసీలను చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం శుభపరిణామమన్నారు.
