- కులగణన లెక్కలు తేలినంకనే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్
- జాజుల నేతృత్వంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో ఆందోళన
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర కులగణన పూర్తికాకుండానే డీలిమిటేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్ లో బీసీలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద డీలిమిటేషన్ పత్రాలను చింపి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో పలు పార్టీల నేతలు పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... డీలిమిటేషన్, మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ‘వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలకు పోయినట్టు ఉంది’ అని ఎద్దేవా చేశారు.
గత 11 ఏండ్ల బీజేపీ పాలనలో దేశంలోని 80 కోట్ల మంది బీసీలకు ఏమీ చేయని వాళ్లు, ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల ఆకాంక్షలను గౌరవించని మోదీ.. తాను బీసీ ప్రధాని అని చెప్పుకునే నైతికత లేదన్నారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదని, అగ్రకులాల ఆధిపత్యం ఇంకా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభలలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఎన్ని బిల్లులు ప్రవేశపెట్టినా బీసీలకు ఒరిగేదేమీ లేదన్నారు.

