బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని  అమలుపరచాలి

బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని  అమలుపరచాలి

హనుమకొండ సిటీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు అధ్యక్షతన నక్కలగుట్టలోని హరిత హోటల్‌‌‌‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌‌‌లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. 

2011 నుంచి ఉద్యమం సాగుతుండగా, 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో సబ్ ప్లాన్ ప్రకటించిందని, రాష్ట్ర విభజన కారణంగా అది అమలుకాలేదని చెప్పారు. సబ్ ప్లాన్‌‌‌‌తో పాటు బడ్జెట్‌‌‌‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్లు ఎం.సారంగపాణి, గోపు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన 12 బడ్జెట్లలో బీసీలకు మూడు శాతం కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. అనంతరం ప్రొఫెసర్​ మురళీ మనోహర్ రూపొందించిన బీసీ సబ్ ప్లాన్ డ్రాఫ్ట్‌‌‌‌ను విడుదల చేశారు. సమావేశంలో డాక్టర్ గడ్డం కృష్ణయ్య, డాక్టర్ పాలడుగుల సురేందర్, ఎదునూరి రాజమౌళి, ధారబోయిన సతీశ్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్, డాక్టర్ కత్తెరశాల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.