బీసీల డిమాండ్లపై నవంబర్‌‌‌‌లో ‘చలో పార్లమెంట్‌‌‌‌’ : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీల డిమాండ్లపై నవంబర్‌‌‌‌లో ‘చలో పార్లమెంట్‌‌‌‌’ : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

సైఫాబాద్, వెలుగు: బీసీల డిమాండ్ల సాధన కోసం నవంబర్‌‌‌‌‌‌‌‌లో చలో పార్లమెంట్‌‌‌‌ నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓబీసీ మహాసభ తీర్మానాల ప్రతులను హైదరాబాద్‌‌‌‌ సైఫాబాద్‌‌‌‌లోని బీసీ జేఏసీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీల రిజర్వేషన్లను పెంచాలని ఆయన కోరారు. 

సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి, బీసీలకు పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్నారు. బీసీ మహిళలకు సబ్‌‌‌‌కోటా కల్పించిన తర్వాతే పార్లమెంట్‌‌‌‌లో ఆమోదించాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకు దేశవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని ప్రకటించారు. శీతాకాల సమావేశాల సందర్భంగా లక్ష మందితో చలో పార్లమెంట్‌‌‌‌ నిర్వహిస్తామని, అప్పటివరకు కశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.