బీసీలు కావాలా.. వద్దా? రెండ్రోజుల్లో తేల్చుకోండి : బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్

బీసీలు కావాలా.. వద్దా? రెండ్రోజుల్లో తేల్చుకోండి : బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
  •     బీఆర్‌‌ఎస్‌ పార్టీకి జాజుల శ్రీనివాస్​గౌడ్ అల్టిమేటం

పంజాగుట్ట/బషీర్​బాగ్, వెలుగు: బీసీల ఓట్లు కావాలో.. బీసీ వ్యతిరేకులు కావాలో.. తేల్చుకోవాలని బీఆర్‌‌ఎస్‌ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్ అల్టిమేటం జారీ చేశారు. ఆ పార్టీకి రెండ్రోజులు గడువు ఇస్తున్నామని, ఈలోపు ఏదీ తేల్చకపోతే అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తాము బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తుంటే బుడ్డంగారి మాధవ రెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లు నిలిపివేసేలా హైకోర్టులో కేసు వేశాడని మండిపడ్డారు. 

బీసీ వ్యతిరేకి అయిన మాధవరెడ్డికి మాజీ మంత్రి మల్లారెడ్డి సహకారంతో బీఆర్ఎస్ బీ ఫామ్‌ ఇచ్చి, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించడంతో బీసీలపై బీఆర్ఎస్ వైఖరి అర్థమవుతున్నదన్నారు. పార్టీ పెద్దలు రెండ్రోజుల్లో అతనిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు మైనంపల్లి శ్రీనివాస్, కుందారం గణేశ్‌ చారి, తాడి విక్రమ్ గౌడ్, మహిళా నాయకులు మణి మంజరి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

బీసీల రాజకీయ శకం ప్రారంభం.. 

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీసీల రాజకీయ శకం ఆరంభమైందని జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేన ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన గౌడ సర్పంచ్, ఉప సర్పంచులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు.