జయలక్ష్మిని తొలగిస్తే జేఎన్టీయూను ముట్టడిస్తాం : బీసీ సంక్షేమ సంఘం

జయలక్ష్మిని తొలగిస్తే జేఎన్టీయూను ముట్టడిస్తాం : బీసీ సంక్షేమ సంఘం

బషీర్‌‌బాగ్, వెలుగు: జేఎన్‌‌టీయూ రిజిస్ట్రార్‌‌గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసాగించాలని, ఆమెను తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌‌బాగ్ ప్రెస్‌‌క్లబ్‌‌లో మాట్లాడారు. జేఎన్‌‌టీయూ చరిత్రలో తొలి మహిళా రిజిస్ట్రార్‌‌గా బాధ్యతలు చేపట్టిన బీసీ వర్గానికి చెందిన ప్రొఫెసర్ జయలక్ష్మిని కేవలం 45 రోజుల్లోనే తొలగించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఓయూలో రౌండ్‌‌టేబుల్ సమావేశం నిర్వహించి, ఆగస్టు 3న వేలాది మంది బీసీలతో కలిసి జేఎన్‌‌టీయూను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

సిబ్బంది నిరసన..

కూకట్‌‌పల్లి, వెలుగు: జేఎన్‌‌టీయూ రిజిస్ట్రార్ జయలక్ష్మిని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బోధన, బోధనేతర సిబ్బంది శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. జయలక్ష్మిని బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ప్రచారం నేపథ్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.