సైఫాబాద్, వెలుగు: జేఎన్‌టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని యథావిధిగా పదవిలో కొనసాగించాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణిమంజరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమెను తొలగించే ప్రయత్నాలు మహిళా సమాజాన్ని, బీసీలను అవమానించడమేనని విమర్శించారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో ఆదివారం ఆమె మాట్లాడారు. జేఎన్‌టీయూ ఏర్పడి 54 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకు 27 మంది రిజిస్ట్రార్లు పనిచేశారని, వారిలో ఒక్క మహిళకూ అవకాశం రాలేదన్నారు.
తొలిసారిగా బీసీ మహిళ అయిన ప్రొఫెసర్ జయలక్ష్మికి అవకాశం లభించగా, 45 రోజులు కూడా పూర్తికాకముందే ఆమెను తొలగించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని అన్నారు. జయలక్ష్మిని రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని, లేనిపక్షంలో బీసీ మహిళలు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి తారాకేశ్వరి, సంధ్యారాణి, మీనా దేవి, శివమ్మ, రేణుక, రత్నమాల తదితరులు పాల్గొన్నారు.
