ముంబై: విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించడంపై జరిగిన రగడ చల్లారకుండానే బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చుట్టూ మరో వివాదం రాజుకుంటోంది. నేషనల్ సీనియర్ సెలెక్షన్ కమిటీ మీటింగ్ లకు దాదా తరచూ హాజరవ్వడం తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బోర్డు రూల్స్ కు వ్యతిరేకంగా ప్లేయర్ల ఎంపికలో గంగూలీ జోక్యం చేసుకుంటున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంలో గంగూలీ పాత్ర ఉందన్న అభిప్రాయం ఉంది.
వాస్తవానికి బోర్డు రూల్స్ ప్రకారం.. బోర్డు ప్రెసిడెంట్‌కు సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో ఎలాంటి పాత్ర లేదు. సెలెక్షన్ కమిటీ కన్వీనర్ గా బీసీసీఐ సెక్రటరీ మాత్రం మీటింగ్స్‌కు అటెండ్ అవ్వొచ్చు. కానీ, టీమ్‌ను ఎంపిక చేసే తుది నిర్ణయం మాత్రం సెలెక్టర్లదే. ఇవన్నీ తెలిసిన గంగూలీ సెలెక్షన్ కమిటీ మీటింగ్స్‌కు అటెండ్ అవుతున్నారు. టీమ్ ఎంపికను ఎలాంటి జోక్యం చేసుకోకపోయినప్పటికీ.. మీటింగ్‌లో దాదా ఉండటంతో తాము కాస్త ఇబ్బంది పడుతున్నామని ఓ సెలెక్టర్ చెప్పారు. సెలెక్షన్ కమిటీ మీటింగ్స్‌లో గంగూలీకి పనేంటని బోర్డు అధికారి ఒకరు ప్రశ్నించారు.

