శ్రీలంక టూర్‌కు భారత్ స్క్వాడ్ రెడీ.. జట్టులో బుమ్రా, జడేజా ఉంటారా?

శ్రీలంక టూర్‌కు భారత్ స్క్వాడ్ రెడీ.. జట్టులో బుమ్రా, జడేజా ఉంటారా?

India vs Sri Lanka Tests: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. గాలే, కొలంబో వేదికలుగా జరగనున్న ఈ సిరీస్ ఇండియాకు ఎంతో కీలకం. 2025 నవంబర్‌లో గువాహటిలో దక్షిణాఫ్రికాతో ఆడిన తర్వాత టీమిండియా WTC రేసులో నిలిచే టెస్టు మ్యాచులు ఆడకపోవడంతో ఈ సిరీస్‌పై ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న భారత జట్టుకు, వారి సొంత గడ్డపై శ్రీలంకను ఓడించడం చాలా కష్టం. 

టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే: 
ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. ఈ వారంలో లేదా జులై 26 (ఆదివారం) నాటికి జట్టును వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సెలక్షన్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండటంపై సస్పెన్స్ నెలకొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జడ్డూ మాత్రం గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. మరీ బీసీసీఐ అతడికి శ్రీలంక టూర్ కి ఛాన్స్ ఇస్తుందో లేదో అనేది. 

మెరిసిన సాయి సుదర్శన్, మానవ్ సుతార్: 
ఇటీవల జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో పాటు ఇండియా-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో (132, 168* పరుగులు) అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్, లంక సిరీస్‌లో నెంబర్3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. దేవదత్ పడిక్కల్ కూడా జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నాడు. మరోవైపు అరంగేట్రం మ్యాచ్‌లోనే 7 వికెట్లు పడగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రదర్శన జట్టుకు లభించిన అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

WTC పాయింట్ల పట్టికలో భారత స్థానం: 
2025–27 WTC సైకిల్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన 9 టెస్టుల్లో 4 విజయాలు, 4 ఓటములు నమోదు చేసింది. లంక సిరీస్‌తో కలిపి ఈ రేసులో ఇండియాకు ఇంకా 9 టెస్టులు మిగిలి ఉన్నాయి. టీమిండియా మళ్లీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ 9 మ్యాచ్‌ల్లో కనీసం 7 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది. దాంతో శ్రీలంకతో జరగబోయే ఈ రెండు టెస్టుల సిరీస్ గిల్ సేనకు అత్యంత కీలకంగా మారింది.