బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు దక్కాల్సిందే ..బీసీ అఖిలపక్ష నేతల డిమాండ్

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు దక్కాల్సిందే ..బీసీ అఖిలపక్ష నేతల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: దేశంలో అసమానతలు, కుల వివక్ష ఉన్నంత కాలం సామాజిక రిజర్వేషన్లు కొనసాగించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వచ్చే నెల 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ సన్నాహక సమావేశం కాచిగూడలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 60 శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.

జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కేలా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మండలి డిప్యూటీ చైర్మన్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఉద్యమం మాదిరిగా పోరాడితేనే బీసీల హక్కులు నెరవేరుతాయన్నారు.

కాంగ్రెస్  పీఏసీ సభ్యుడు ఈరవత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. రాజకీయ పార్టీలకతీతంగా బెంగళూరు మహాసభకు బీసీలు తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, జేఏసీ నేతలు గుజ్జ కృష్ణ, విక్రమ్ గౌడ్, కుందానం గణేశ్‌‌చారి పాల్గొన్నారు.