రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు సరైన వాటా లేదు..బీసీల డిమాండ్లపై జులైలో సదస్సు నిర్వహిస్తం: ఎంపీ ఆర్.కృష్ణయ్య

రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు సరైన వాటా లేదు..బీసీల డిమాండ్లపై జులైలో సదస్సు నిర్వహిస్తం: ఎంపీ ఆర్.కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు గడుస్తోన్నా.. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సరైన వాటా దక్కడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అందువల్ల బీసీల డిమాండ్ల సాధనకై జులై చివరి వారంలో ఢిల్లీలో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

ఈ సభకు కేంద్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర నుంచి బీసీ నాయకులు, ప్రజలు పాల్గొంటారని తెలిపారు. 

శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... గత పాలకులు దేశంలోని బీసీలకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడైనా ప్రధాని మోదీ నాయకత్వంలో బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీల సమస్యలపై త్వరలో ప్రధాని మోదీని కలిసి బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని కోరుతామని చెప్పారు. 

జనాభా ప్రకారం రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. బీసీలకు రాజకీయ వాటా ఇవ్వడం కోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ నాయకుడైన మోదీ హయాంలో బీసీ వర్గాలకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఇంకెవరు బీసీలకు న్యాయం చేయలేరని పేర్కొన్నారు.