24న చలో కొల్లాపూర్.. పోస్టర్​ను ఆవిష్కరించిన కృష్ణయ్య

24న చలో కొల్లాపూర్..  పోస్టర్​ను ఆవిష్కరించిన కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు : పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కొల్లాపూర్ లో బీసీల బహిరంగ సభ నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. శనివారం హైదరాబాద్ లో బీసీ భవన్  వద్ద ‘చలో కొల్లాపూర్’ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, బిహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. 

బీసీలు పార్టీలకు అతీతంగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు. అందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా పర్యటిస్తామని చెప్పారు. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని, బీసీల వాటా బీసీలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్  గుజ్జ కృష్ణ, నందగోపాల్, రాజ్ కుమార్, రాజేందర్, అనంతయ్య, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.