రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నఖ్వీ సీరియస్

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి నఖ్వీ సీరియస్

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపాటు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఫెయిల్ అయిందని విమర్శించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. పరిష్కారంలో భాగమవ్వాలని, రాజకీయ అంతరాయంలో కాదని నఖ్వీ సూచించారు. దేశంలో లాక్‌డౌన్‌ ఫెయిల్ అయిందని శుక్రవారం రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే దేశాలతో ఇండియా లాక్‌డౌన్‌ పోలుస్తూ ఉన్న గ్రాఫ్స్‌ను పోస్ట్ చేశారు. ఈ గ్రాఫ్స్‌లో లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మిగతా దేశాల్లో కరోనా కేసులు తగ్గిపోగా.. ఇండియాలో మాత్రం ఆ సంఖ్య పెరుగుతున్నట్లుగా ఉంది. ఈ పోస్ట్‌కు ఫెయిలైన లాక్‌డౌన్ ఇలా ఉంటుంది అంటూ రాహుల్ గాంధీ క్యాప్షన్ జత చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్‌పై అబ్బాస్ నఖ్వీ స్పందించారు. కరోనాపై పోరాటంలో కాంగ్రెస్ తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, అయోమయాన్ని సృష్టిస్తోందని నఖ్వీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పొల్యూషన్‌ను వ్యాప్తి చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు.

‘మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైమ్‌లో రాజకీయ కాలుష్యాన్ని తయారు చేసే లేబొరేటరీగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. వాళ్లు (కాంగ్రెస్ లీడర్లను ఉద్దేశించి) ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కరోనాపై పరిష్కారంలో భాగమవ్వాలని కాకుండా పొలిటికల్ పొల్యూషన్‌ను వ్యాప్తి చేయాలని మాత్రమే వాళ్లు అనుకుంటున్నారు. మేం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నప్పుడు.. లాక్‌డౌన్ ఎందుకని వాళ్లు ప్రశ్నించారు. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. సమస్య ఏంటంటే.. వారికి దేనిపైనా సరైన అవగాహన లేదు. అయినా సరే తమను తాము అన్నీ తెలిసిన ఎక్స్‌పర్ట్స్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నా తరఫున వారికో సలహా ఇస్తున్నా. పరిష్కారంలో భాగమవ్వండి.. రాజకీయ అంతరాయంలో కాదు’ అని అబ్బాస్ నఖ్వీ చెప్పారు.