రిజర్వ్ చేసిన కేసుల్లో మూడు నెలల్లోపు తీర్పులు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

రిజర్వ్ చేసిన కేసుల్లో మూడు నెలల్లోపు తీర్పులు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు

ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుల జాప్యంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులపై అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. పూర్తి కారణాలతో కూడిన తీర్పు 7 రోజుల్లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. 

ప్రత్యేక పరిస్థితుల్లో 15 రోజుల్లో తీర్పు అప్‌లోడ్‌ చేయాలని, ప్రకటించిన తీర్పు 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. 3 నెలల్లో తీర్పు రాకపోతే కేసు చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి వెళ్లాలని సుప్రీం కోర్టు హైకోర్టులకు స్పష్టం చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాఘ్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తేదీ నుంచి గరిష్టంగా మూడు నెలల వ్యవధిలోగా హైకోర్టులు తీర్పును వెలువరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదని.. బెయిల్ దరఖాస్తులను సాధారణంగా అదే రోజు విచారించి.. తీర్పు చెప్పి, అప్‌లోడ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే.. దానిని మరుసటి రోజు ప్రకటించి.. ఆ వెంటనే అప్‌లోడ్ చేయాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసే లేదా శిక్షలను నిలిపివేసే ఉత్తర్వులను జైలు అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించింది. విచారణలో ఉన్న ఖైదీకి లేదా దోషికి బెయిల్ మంజూరు చేసినా లేదా శిక్షను రద్దు చేసినా.. వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది.