- చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు
- బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లు, బలమైన గాలులతో కూడిన వానకు శివాజీనగర్‌లోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్న పిల్లలతో సహా మొత్తం ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం సాయంత్రం నగరాన్ని భారీ వర్షం ముంచెత్తిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఏడుగురు ఆసుపత్రి పాత ప్రహరీ గోడ పక్కన నిలబడ్డారని తెలిపారు. అయితే, గాలుల ధాటికి గోడ ఒక్కసారిగా వారిపై పడిపోయిందన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారంతా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఎర్త్ మూవర్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
ప్రమాద స్థలానికి సీఎం సిద్ధరామయ్య
ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం సిద్ధరామయ్య ప్రమాద స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కూడా తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

