గోషామహల్ లో బీఆర్ఎస్ మీటింగ్ రసాభాస...ఒకరినొకరు తోపులాట, వాగ్వాదం

గోషామహల్ లో బీఆర్ఎస్ మీటింగ్ రసాభాస...ఒకరినొకరు తోపులాట, వాగ్వాదం

ముషీరాబాద్, వెలుగు: గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం నిర్వహించిన సన్నాహక సమావేశంలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కట్టెల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్​చార్జి గొండ్ల నాగేందర్ గౌడ్ మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు లేచి తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ నిలదీశారు. 

ఒకరిద్దరు నాయకులు వేదికపైకి వచ్చి స్థానిక నాయకత్వం సరిగా పనిచేయడం లేదని, తీరు మారకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. మరికొందరు వారిని సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వాగ్వాదం మరింత తీవ్రమైంది. కార్యకర్తలు, నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు లైట్లు, ఫ్యాన్లు ఆపేసి అందరినీ బయటకు పంపించారు. అనంతరం బయటకు వచ్చిన నాయకులు గేటు ముందు కూడా వాగ్వాదానికి దిగడం, తోపులాటకు పాల్పడడం గమనార్హం.