న్యూఢిల్లీ: టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.7,325 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.11,021 కోట్లతో పోలిస్తే ఇది 33.5 శాతం తక్కువ. కంపెనీ ఆదాయం15.6 శాతం పెరిగి రూ.47,876.2 కోట్ల నుంచి రూ.55,383.2 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుడిపై వచ్చే సగటు ఆదాయం (ఆర్పూ) గత ఏడాది కాలంలో రూ.245 నుంచి రూ.257కి పెరిగింది.
కిందటేడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) తో పోలిస్తే క్యూ4 లో ఎయిర్‌టెల్ నికర లాభం 10.4 శాతం పెరగగా, ఆదాయం 2.5 శాతం వృద్ధి చెందింది. క్యూ4లో కేవలం ఇండియా మార్కెట్ నుంచే ఎయిర్‌టెల్‌కు రూ.39,566 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 2025–-26లో కంపెనీ లాభం ఏడాది లెక్కన 20.4 శాతం తగ్గి రూ.26,695 కోట్లుగా ఉంది. అయితే, ఆదాయం 21.9 శాతం పెరిగి రూ.2,10,972.8 కోట్లకు చేరుకుంది.
ఎయిర్‌టెల్ ప్రయాణంలో 2026 ఒక ముఖ్యమైన సంవత్సరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో సంస్థ 65 కోట్ల కస్టమర్ల మార్కును దాటిందని, సావరిన్ క్లౌడ్ లాంచ్ చేసిందని, ఆర్బీఐ అనుమతితో లెండింగ్ వ్యాపారం ప్రారంభించిందని అన్నారు.
