తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే టాప్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే టాప్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆన్ లైన్ ఆడిటింగ్ లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వరుసగా మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ఆన్ లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయని  గుజరాత్ అధికారులకు భట్టి వివరించారు. 

తెలంగాణ ఆడిట్ శాఖ పనితీరు అధ్యయనానికి  అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి  అధికారులు పూర్తిగా సహకరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. గత రెండు రోజులుగా  రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ఆన్ లైన్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నామని, తెలంగాణలో ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని గుజరాత్ అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.