‘ప్రైవేట్​’ అంటే అమ్మేయడమే: భట్టి విక్రమార్క ఫైర్

‘ప్రైవేట్​’ అంటే అమ్మేయడమే: భట్టి విక్రమార్క ఫైర్

    ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి

    ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యం లేదు

    సీఎం కేసీఆర్​పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

హైదరాబాద్‌, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ మాటలు చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉంది. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాబోయే రోజుల్లో మరో మూడు లక్షల కోట్లు అప్పులు చేసేటట్లు ఉన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీని ఆరేండ్లలో దివాలా తీయించి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ, రేపు సింగరేణితోపాటు రాష్ట్రం ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యం లేదు”అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆదివారం అసెంబ్లీ ప్రెస్‌ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమని, ప్రతిపక్షాలు కాదన్నారు.

కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలనే కార్మికులు అడుగుతున్నారని, వారి డిమాండ్లు న్యాయబద్ధమైనవని, అందుకే ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ క్యాపిటలిస్ట్, ఫ్యూడలిస్ట్ భావంతో ఉన్నారని, తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కేసీఆర్‌ సొంత ఎస్టేట్ కాదని, మంచి పాలన ఇవ్వాలని ప్రజలు అధికారం ఇచ్చారని, ఆ అవకాశాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మేయడమేనని, ప్రజల ఆస్తులను.. రూట్ల ప్రైవేటీకరణ చేసేందుకు కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు.