మార్కాపురం: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగాక కాలిపోయిన బస్సును పోలీసులు తనిఖీలు చేయగా ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ఒకటి బయటపడింది. అయితే.. ఆ సిలిండర్ పేలిందో.. లేదో కచ్చితంగా చెప్పలేమని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
సిలిండర్ ఆకారం చూస్తుంటే బస్సులో రేగిన మంటల్లో కాలిపోయి నల్లగా కనిపిస్తుందే తప్ప పేలినట్లుగా లేదు. మార్కాపురం దగ్గరలోని రాయవరం దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సులోని ప్రయాణికుల్లో 13 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కావడం శోచనీయం. మరో 26 మంది హాస్పిటల్లో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీళ్లలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం 6 నుంచి 6.30 గంటల సమయంలో ఈ విషాదం జరిగింది.
ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉండటం గమనార్హం. బస్సులోకి మంటలు వ్యాపించగానే వెనుక ఉన్న ప్రయాణికులు బయటకు రాలేక సజీవ దహనం కావడం బాధిత కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
