బీహార్‌‌‌‌లో 63 శాతం బీసీలు.. కుల గణన వివరాలను రిలీజ్ చేసిన జేడీయూ ప్రభుత్వం

బీహార్‌‌‌‌లో  63 శాతం బీసీలు.. కుల గణన వివరాలను రిలీజ్  చేసిన జేడీయూ ప్రభుత్వం
  • అత్యధికంగా యాదవ సామాజిక వర్గంలో 14.27 శాతం మంది
  • రాష్ట్ర జనాభా 13.07 కోట్లు.. హిందువులు 81.99 %, ముస్లింలు 17.7 %
  • కులాలవారీ జనాభా లెక్కలు వెల్లడించిన మొదటి రాష్ట్రంగా రికార్డు
  • దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి: కాంగ్రెస్

పాట్నా:  తమ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన వివరాలను బీహార్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అత్యధికంగా బీసీలు 63 శాతం ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాలు (ఈబీసీలు) 36 శాతం, ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీలు) 27.13 శాతం ఉన్నట్లు తెలిపింది. ఇక ఎస్సీలు 19.65 శాతం, ఎస్టీలు 1.68 శాతం, జనరల్ కేటగిరీలో 15.52 శాతం మంది ఉన్నట్లు చెప్పింది. ఈ సర్వే పూర్తయినట్లు ఆగస్టు 25న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించగా.. సోమవారం ఈ మేరకు రిపోర్టును ‘బీహారీ జాతి ఆధారిత్ గణన’ పేరుతో రాష్ట్ర డెవలప్‌‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ రిలీజ్ చేశారు. 

రాష్ట్ర జనాభా 13.07 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం.. బీహార్‌‌‌‌లో కులాల వారీగా చూస్తే యాదవ సామాజిక వర్గం ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్లు 14.27 శాతం మంది ఉన్నారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌‌ది యాదవ కమ్యూనిటీ. కుశ్వాహా వర్గం వారు 4.27 శాతం, కుర్మి కమ్యూనిటీ వాళ్లు 2.87 శాతం మంది ఉన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌‌‌‌ది కుర్మి కమ్యూనిటీ. రాష్ట్ర జనాభాలో హిందువులు 81.99 శాతం మంది ఉన్నారు. ముస్లింలు 17.7, క్రిస్టియన్లు 0.05, సిక్కులు 0.01, బుద్ధిస్టులు 0.08, ఇతర మతాల వారు 0.12 శాతం ఉన్నారు. దేశంలో కులాల వారీగా మొదటిసారి జనాభా వివరాలు ప్రకటించిన రాష్ట్రంగా బీహార్​ రికార్డులకెక్కింది.

సర్వే ఆధారంగా అభివృద్ధి పనులు: నితీశ్ కుమార్

కులాల వారీగా జనాభా లెక్కింపు చేపట్టిన అధికారుల బృందాన్ని సీఎం నితీశ్ కుమార్‌‌ అభినందించారు. ఈ సర్వే కేవలం కులాల వారీ జనాభా గురించి తెలియజేయలేదని.. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి గురించి కూడా సమాచారమిచ్చిందని అన్నారు. ‌‌ఈ సర్వే రిపోర్టు ఆధారంగా అభివృద్ధికి, అన్ని రంగాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీహార్‌‌‌‌లో చేపట్టిన కుల గణన రిపోర్టును.. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రచురిస్తున్నామని చెప్పారు. 

కులాల వారీగా జనాభా లెక్కింపు ప్రతిపాదనకు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 9 పార్టీల సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వం జనాభా గణనను నిర్వహించాలని నిర్ణయించింది. దానికి రాష్ట్ర కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. ప్రభుత్వం తన సొంత వనరులతో కులాల వారీగా జనాభా లెక్కింపు చేపట్టింది” అని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న తొమ్మిది రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని, వాస్తవాలు, గణాంకాలను వారితో పంచుకుంటామని తెలిపారు. మంగళవారం ఆల్‌‌ పార్టీ మీటింగ్‌‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 

కేంద్రంలో 90 మంది సెక్రటరీల్లో బీసీలు ముగ్గురే: రాహుల్ గాంధీ

బీహార్ క్యాస్ట్ సర్వేపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. ‘‘ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 84 శాతం మంది ఉన్నారని బీహార్ కులగణనలో తేలింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న 90 మంది సెక్ర టరీల్లో.. ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారు” అని ట్వీట్ చేశారు. ‘‘ఇండియాలో కులాల వారీగా లెక్కలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ‘ఎక్కువ జనాభా, ఎక్కువ హక్కులు’.. ఇదే మా ప్రతిజ్ఞ” అని పేర్కొన్నారు. 

కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్‌‌లో ఉన్నా..

కులాల వారీగా లెక్కింపు చేపట్టడం కుదరదని కేంద్రం స్పష్టం చేసిన తర్వాత గతేడాది ఈ సర్వేకు నితీశ్ కుమార్ ఆదేశించారు. అయితే 2024 లోక్‌‌సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జేడీయూ ప్రభుత్వం కుల గణన చేపట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కుల గణనను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. జనాభా గణన లేదా జనాభా గణనకు సమానమైన మరేదైనా చర్య తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని సుప్రీంకోర్టులో కేంద్రం వాదనలు వినిపించింది. తాము రాష్ట్రంలో కుల గణన చేయడం లేదని, ప్రజల ఆర్థిక స్థితిగతులు, వారి కులానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తున్నామని, తద్వారా వారికి మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకుంటుందని నితీశ్ కుమార్ చెప్పారు. 

స్టడీ చేశాకప్రకటన చేస్తం: బీజేపీ

కుల గణన సర్వేపై బీహార్ బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏండ్లుగా మారిన సమాజిక పరిస్థితులు, ఆర్థిక వాస్తవాలపై ఓ ఐడియాను ఈ సర్వే ఇవ్వలేకపోయిందని విమర్శించింది. ‘‘ఈ ప్రక్రియకు బీజేపీ గతంలోనే సమ్మతి తెలిపింది. ఇప్పుడు వెల్లడించిన ఫలితాలను అంచనా వేస్తుంది. మా స్టడీలో తేలిన అంశాలపై త్వరలోనే స్టేట్‌‌మెంట్‌‌ను విడుదల చేస్తాం. ఈ సర్వే వివిధ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసిందనే అనుకుంటున్నాం. వాటిని రికార్డులో ఉంచాలని కోరుతున్నాం. మారిన సామాజిక, ఆర్థిక వాస్తవాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి” అని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి సూచించారు. 

దేశవ్యాప్తంగాచేపట్టాలి: కాంగ్రెస్

కులాల వారీగా జనాభా లెక్కలను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేసేందుకు, సోషల్ ఎంపవర్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్స్‌‌కు దృఢమైన పునాది వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఇలాంటి లెక్కింపును జాతీయ స్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేసింది. గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ.. జనాభా లెక్కింపును చేపట్టిందని, కానీ మోదీ ప్రభుత్వం ప్రచురించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘‘బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఇనిషియేటివ్‌‌ను మేం స్వాగతిస్తున్నాం. కర్నాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో సర్వేలు చేశాయి. జాతీయ కుల గణనను వీలైనంత త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్‌‌ చేస్తోంది” అని ట్వీట్ చేశారు. ఒకవేళ కులాల వారీగా జనాభా లెక్కింపును మోదీ ప్రభుత్వం చేపట్టకపోతే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చేస్తుందని చెప్పారు.