- అమెరికా కాంగ్రెస్ కమిటీ విచారణలో వాంగ్మూలం
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ -వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా కాంగ్రెస్కమిటీ ఎదుట తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. ఈ నెల 10న జరిగిన ఈ విచారణకు సంబంధించిన అధికారిక ట్రాన్స్‌క్రిప్ట్ మంగళవారం వెలుగులోకి వచ్చాయి. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్.. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుని, ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడానికి లేదా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ఈ విచారణ చేపట్టింది.
ప్రస్తుతం 70 ఏండ్ల వయసున్న బిల్ గేట్స్.. విచారణలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ గేమ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, అణు శాస్త్రవేత్త కరిమా నిగ్మతులీనా, డాక్టర్ ఆలిస్ జాకబ్స్ నెస్సెల్రోడ్తో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ఎప్‌స్టీన్‌తో పరిచయం ఒక పొరపాటు
ఎప్‌స్టీన్ నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని బిల్ గేట్స్ స్పష్టంచేశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న పరిచయంపై గేట్స్ స్పందిస్తూ.. తామిద్దరం 2011 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 12 నుంచి 14 సార్లు ప్రత్యక్షంగా, రెండుసార్లు స్కైప్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు పెద్ద పెద్ద దాతల నుంచి నిధులు సేకరించే ఉద్దేశంతోనే అతడిని కలిశానని చెప్పారు.
అప్పటికే ఎప్‌స్టీన్ లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించాడని తెలిసినప్పటికీ, అతడిని కలవడం తాను చేసిన పెద్ద పొరపాటని గేట్స్ అంగీకరించారు. దాతలను తీసుకువస్తానన్న ఎప్‌స్టీన్ మాటలు కేవలం అబద్ధాలని తేలడంతో, ఆ తర్వాత అతనితో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు బిల్ గేట్స్ వివరించారు.
