చాలా మందికి గుళ్లో ప్రసాదం ఎందుకు పెడతారు అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండదు. చరిత్ర, సాంప్రదాయం ప్రకారం దేవుడి దర్శన అనంతరం గుడిలో పెట్టే ప్రసాదాన్ని తప్పని సరిగ్గా సేవించాలని అంటారు.
83 ఏళ్లుగా మటన్ బిర్యానీయే ప్రసాదం
పూజ అనంతరం దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత భక్తులకు ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. ఆ ప్రసాదం దేవుడి ముందు పెట్టడం వల్ల ఆ ప్రసాదం అమృతంగా మారుతుందని, అది తినడం వల్ల భోగభాగ్యాలు, అష్టఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఆ నమ్మకం ఒమ్ము కాకుండా భక్తులు ప్రసాదాన్ని సేవించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మనకు తెలిసి ప్రసాదం అంటే దద్దోజనం, వడపప్పు దేవుడిని బట్టి, ప్రాంతాన్ని బట్టి దేవుడికి పంచిపెట్టే ప్రసాదం వితరణ ఉంటుంది. కానీ తమిళనాడులోని తిరుమంగళం తాలుకా వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునియండి ఆలయంలో గత 83 ఏళ్లుగా మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచిపెడుతున్నారు.
83 ఏళ్ల క్రితం ఎస్వీఎస్ సుబ్బనాయుడు మునీశ్వరుడి పేరుతో ప్రారంభించిన హోటల్ లాభాల బాట పట్టడంతో ఆ స్వామికి రెండేళ్లపాటు బిర్యానిని నైవేద్యంగా పంచిపెట్టారని, అప్పటి నుంచి ఆ ఆచారం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
ప్రతీ ఏటా జనవరి 24 నుంచి 26 వరకు ఆ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా 200మేకలు, 250 కోళ్లతో 2000 కేజీల బిర్యానీని తయారు చేస్తారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. తారతమ్యం, వయో భేదంలేకుండా మటన్ బిర్యానిని సేవించడానికి భక్తులు వివిధ ప్రాంతలనుంచి తరలి వస్తారని ఆలయ నిర్వాహక కమిటీ సభ్యుడు ఎన్. మునీశ్వరన్ తెలిపారు.
