ఎండలు దంచికొడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు సెలవులను అధికారులు ముందుగానే ప్రకటించారు.
48 రోజుల పాటు సెలవులు..
విద్యాశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలంగాణలోని స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు అమల్లో ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
సెలవులు ప్రారంభమయ్యే లోపు సిలబస్ పూర్తి అయ్యేలా చూడాలని ప్రభుత్వం పాఠశాలల యాజమాన్యాలకు సూచించింది. అవసరమైతే విద్యాపరంగా ఎలాంటి అంతరాయం లేకుండా వారానికి ఒకసారి అదనపు తరగతులు నిర్వహించవచ్చని తెలిపింది.
