తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ సాయంతో రూపొందుతున్న తొలి పూర్తిస్థాయి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా "అంబ'స్ రివెంజ్" సరికొత్త రికార్డు సృష్టించనుంది. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగపూరితమైన 'అంబ' పాత్ర నేపథ్యంలో ఈ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగపూరితమైన పాత్రలలో 'అంబ' ఒకరు. భీష్ముడిపై ఆమె పెంచుకున్న పగ, ఆ ప్రతీకారం వెనుక ఉన్న ఆవేదనను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు. ఒక పౌరాణిక గాథను వెండితెరపై ఆవిష్కరించడం అంటే భారీ సెట్లు, వేలమంది జనం అవసరం. కానీ, ఈ సినిమాను అత్యాధునిక ఏఐ టూల్స్ ఉపయోగించి నిర్మిస్తుండటం విశేషం. పాత్రల రూపకల్పన నుండి విజువల్ ఎఫెక్ట్స్ వరకు ప్రతిదీ ఏఐ సాయంతో అత్యున్నత ప్రమాణాలతో సిద్ధమవుతోంది.
హనుమాన్ విజయోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పోస్టర్‌లోని ఇంటెన్సిటీ ప్రేక్షకుల్లో సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది.
అత్యాధునిక ఏఐ టూల్స్‌ను ఉపయోగించి విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పురాణ కాలం నాటి గాథను భవిష్యత్ సాంకేతికతతో మిక్స్ చేస్తూ వస్తున్న ఈ ప్రయోగం తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విశేషాలను ప్రకటించనున్నారు. ఏఐ ఆధారిత చిత్రాల దిశగా టాలీవుడ్ వేస్తున్న ఈ అడుగు ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షిస్తోంది. . సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు సవాలు విసురుతూ తెలుగు వారు చేస్తున్న ఈ సాహసం ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
