ప్రపంచాన్ని ఏలుతున్న మసాలా కింగ్ : నల్ల మిరియాల ఉత్పత్తిలో నంబర్ 1 దేశం ఏదంటే ?

  ప్రపంచాన్ని ఏలుతున్న మసాలా కింగ్  : నల్ల మిరియాల ఉత్పత్తిలో నంబర్ 1 దేశం ఏదంటే ?

నల్ల మిరియాలు ప్రపంచంలోనే అతి ఎక్కువగా వాడే మసాలా దినుసు. దీనికున్న ప్రత్యేకమైన ఘాటు, రుచి వల్ల దీనిని 'మసాలా దినుసుల రాజు' అని కూడా పిలుస్తారు. వంటల్లోనే కాకుండా, మందుల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తారు. వేడి వాతావరణం, తగినంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి బాగా పండుతాయి.

మిరియాలను అత్యధికంగా పండించే దేశం
ప్రస్తుతం ప్రపంచంలో నల్ల మిరియాల ఉత్పత్తిలో వియత్నాం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే మిరియాలలో ఎక్కువభాగం ఇక్కడి నుండే వస్తుంది. అక్కడి సారవంతమైన నేలలు, ఆధునిక సాగు పద్ధతుల వల్ల వియత్నాం నాణ్యమైన మిరియాలను పండిస్తూ అమెరికా, ఐరోపా వంటి అగ్ర దేశాలకు ఎగుమతి చేస్తోంది.

అత్యధికంగా పండించే టాప్ 5 దేశాలు
వియత్నాంతో పాటు మరికొన్ని దేశాలు కూడా మిరియాల సాగులో ముందున్నాయి. వాటిలో వియత్నాం మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్ నాణ్యమైన మిరియాల ఎగుమతిలో కీలకంగా నిలిచింది. తరువాత ఇండోనేషియా... ఇక్కడి వాతావరణం మిరియాల సాగుకు చాలా అనుకూలం. దీని తరువాత భారతదేశం ముఖ్యంగా  కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు మిరియాల సాగులో కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చైనాలో  కూడా మిరియాల సాగు వేగంగా పెరుగుతోంది.

మిరియాల సాగు 
మిరియాల పంట పెరగడానికి ఉష్ణమండల వాతావరణం ఉండాలి. అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉండాలి, వాతావరణం వెచ్చగా ఉండాలి. సరైన వర్షపాతం, సారవంతమైన నేల ఉండాలి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే దేశాల్లో ఇవి చాలా బాగా పండుతాయి.

నల్ల మిరియాల ఉపయోగాలు
నల్ల మిరియాలు సూప్‌లు, కూరలు, మాంసాహార వంటకాల్లో రుచి కోసం వాడతారు. మన ఆరోగ్య విషయానికి జీర్ణశక్తిని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి బాగా పని చేస్తాయి. అందుకే ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా వాడతారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి వంటగదిలోనూ ఇది కనిపిస్తుంది 

 పూర్వకాలంలో మిరియాలు ఎంత విలువైనవంటే, వీటిని  డబ్బుకి బదులుగా వస్తు మార్పిడికి వాడేవారు. అందుకే వీటిని 'నల్ల బంగారం' అని కూడా పిలిచేవారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు మిరియాలను సరఫరా చేయడంలో భారతదేశమే కీలకంగా ఉండేది. విదేశీయులు మన దేశానికి రావడానికి మిరియాల వ్యాపారం కూడా ఒక ముఖ్య కారణం. ప్రస్తుతం వియత్నాం ఏటా లక్షల టన్నుల మిరియాల  దిగుబడి సాధిస్తూ ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది.