విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి.. కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

సీఎం కేసీఆర్ కు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్  లేఖ రాశారు.  విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  రాష్ట్రంలో దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదంటూ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో  విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్న బండి సంజయ్ .. ఎన్నిఇబ్బందులున్నా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు.  ఆర్టిజన్లు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి దిగితే మొత్తం రాష్ట్ర పాలనా యంత్రాంగమే కుప్పకూలుతుందని హెచ్చరించారు.  1999 నుంచి 2004  వరకు విద్యుత్ సంస్థల్లో  నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్న ఆయన.. ఆర్టిజన్ల  సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లు న్యాయపరమైనవని అన్నారు.

జీపీఎఫ్‌, పీఆర్‌సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల  బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి  చిన్నచూపు చూస్తుందన్నారు బండి సంజయ్. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో నే ఉన్నాయని.. కొత్త పీఆర్ సీ గురించి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్ లు, పీఆర్ సీ, జీపీఎఫ్ వంటి సమస్యల విషయంలో ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, ఆర్టిజన్లతో చర్చలు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయపరమైన కోరికలు పరిష్కరించని పక్షంలో తెలంగాణ ఉద్యోగులు ఈ ప్రభుత్వంపై తిరగడబే రోజులు వస్తాయని హెచ్చరించారు బండి సంజయ్.