భారత వృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమే: బీజేపీ

 భారత వృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమే: బీజేపీ

న్యూఢిల్లీ: అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుని ఇండియా తన వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలను రక్షించుకుందని బీజేపీ తెలిపింది. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీకి దేశ ఆర్థిక వృద్ధిపై పట్టింపులేదని ఫైర్ అయింది. అమెరికాతో ట్రేడ్ డీల్ భారత్‌‌కు పూర్తి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ విమర్శించడంతో బీజేపీ కౌంటర్ విచ్చింది. ఈమేరకు శనివారం బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడారు.

‘‘మోదీ నాయకత్వంలో భారత్ వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో తన ప్రయోజనాలను రక్షించుకుంది. గోధుమలు, బియ్యం, చక్కెర, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, జొన్నలు, సజ్జలు, పాడి వంటి ఉత్పత్తులను కాపాడుకుంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు సృష్టిస్తున్న గందరగోళానికి తావు లేదు” అని చెప్పారు. బీజేపీకి చెందిన మరో జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ స్థాయి ‘డీల్-మేకర్’ గా ఎదుగుతుండటం కాంగ్రెస్‌‌కు మింగుడు పడటంలేదని ఆరోపించారు.