బీజేపీలో కలహాలు పెట్టేందుకు కుట్రలు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

బీజేపీలో కలహాలు పెట్టేందుకు కుట్రలు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  •     తెలంగాణలో పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కొందరి ప్రయత్నాలు: బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు
  •     ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శ
  •     ఢిల్లీలో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు పార్టీ చీఫ్ నితిన్ నబీన్‌‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక కొందరు పార్టీలో అంతర్గత కలహాలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడం, ‘రైతు గోస-బీజేపీ భరోసా’కు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు, వ్యక్తులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. తమ పార్టీ ఎంపీపై అతికించిన పోస్టర్లకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై డీజీపీ, నగర పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం తెలంగాణ భవన్‌‌లో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవడానికి పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లతో ప్రభుత్వ కుమ్మక్కు..

రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లతో కుమ్మక్కై రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందకుండా చేస్తోందని రాంచందర్ రావు  ఆరోపించారు. పంటల ఉత్పత్తి అంచనాల్లో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ విఫలమయ్యాయన్నారు. ‘‘మార్చి 25న ప్రారంభించాల్సిన ధాన్యం కొనుగోళ్లను నెల రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 25న ప్రారంభించారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. 

బీజేపీ ఆందోళనల తర్వాతే ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తోంది’’ అని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేంద్రం నేరుగా ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికల ఆధారంగా అంగీకరించిన ధాన్యానికి మాత్రమే రీయింబర్స్‌‌మెంట్‌‌ ఇస్తుందని స్పష్టం చేశారు. “చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర అవతరణ వేడుకలకు నితిన్ నబీన్..

బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరవుతారని రాంచందర్ రావు  తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన మేధావులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. కొత్తగా ఏర్పాటుకానున్న పార్టీ జాతీయ కార్యవర్గం కోసం తెలంగాణ నుంచి పలువురి పేర్లను అధిష్టానానికి పంపినట్లు, దీనిపై తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని పేర్కొన్నారు.