- టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
నిజామాబాద్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆపిన బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హతే లేదన్నారు. 42 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, చట్టం లేకపోయినా మున్నిపల్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి మించి సీట్లు ఇచ్చామని చెప్పారు.
జనరల్‌కు రిజర్వ్ అయిన మేయర్, చైర్‌పర్సన్ స్థానాల్లో కూడా బీసీలకే అవకాశం ఇస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి సన్నిహితులమని చెప్పుకునే బీసీ నేతలు బండి సంజయ్, ఎంపీ అర్వింద్.. బీసీ బిల్లు కోసం ఎందుకు పట్టుబట్టడం లేదని ప్రశ్నించారు. మున్సిపాలిటీల్లోని అవసరాలను గుర్తించేందుకు లోకల్ మేనిఫెస్టోలు రూపొందించామని, వాటిని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తామని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల్లో 75 శాతం నుంచి 90 శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ పరిణతి లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో ఒక్క సీటైనా గెలవాలన్న అర్వింద్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.
ఏడేండ్లలో నిజామాబాద్ జిల్లాలో ఏం అభివృద్ధి చేశారో చర్చకు రావాలని సవాల్ చేశారు. తన తపన మొత్తం జిల్లా అభివృద్ధి కోసమేనని శ్రీరాముడి మీద ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. ఎన్నికల తర్వాత మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయం మేరకు మేయర్‌ను డిసైడ్ చేస్తామని చెప్పారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.
