వడ్లు కొనకుండా కేంద్రంపై నిందలా? : బీజేఏల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

వడ్లు కొనకుండా కేంద్రంపై నిందలా? : బీజేఏల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  •     కల్లాల దగ్గరికి వెళ్తే సీఎంకు రైతుల బాధ తెలుస్తది..
  •     బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం వడ్ల కొనుగోలును గాలికి వదిలేసి కేంద్రాన్ని బద్​నాం చేస్తోందని బీజేఏల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘రైతు గోస బీజేపీ భరోసా’ యాత్ర బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంతో రైతులతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో  80 శాతం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, ఆయన వడ్ల కల్లాలను వస్తే వాస్తవమేంటో తెలుస్తుందని అన్నారు. 

మార్కెట్ యార్డులు, రైతుల పొలాల్లో మక్కలు, వడ్ల రాశులు పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాటారంలో నిరసన తెలిపిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా కొనుగోళ్లు జరిగేలా చూస్తామని మహేశ్వర్​రెడ్డి అన్నారు. 

రైతులపై కేసులు కొట్టేయాలి: రఘునందన్​రావు

రైతుల బాధలను పట్టించుకోని ప్రభుత్వాలు నిలవబోవని మెదక్​ ఎంపీ రఘునందన్​రావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ రైతులకు బేడీలు వేస్తే, ఇప్పుడేమో కాంగ్రెస్​ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. రైతులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్లలో వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

వడ్ల కొనుగోళ్లకు అవసరమైన సంచులు, నిధులు, కమీషన్ అన్నీ కేంద్రమే అందిస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్​రెడ్డి, పవర్ రామారావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ నేతలు బసవ లక్ష్మీనర్సయ్య, బద్దం మైపాల్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ధాన్యం కొనే దాకా వెంటపడుతం..

పెద్దపల్లి: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనేవరకు వెంటపడుతామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంథని ధాన్యం కొనుగోలు కేంద్రం, వ్యవసాయ మార్కెట్‌‌ను బీజేపీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ యాత్ర ఎక్కడ ఉంటే అక్కడికి లారీలు పంపి ధాన్యం తరలిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి, సంధ్యారాణి, నారాయణరెడ్డి, సురేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.