V6 News

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి
  •     బీజేపీ ఎల్పీ మీటింగ్​లో ఎంపిక చేసిన ఎన్డీయే కూటమి
  •     నితీశ్​ను గద్దెదించుతానని గతంలో శపథం చేసిన సమ్రాట్
  •     బిహార్​ సీఎం పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా రికార్డ్
  •     ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్


పాట్నా: బిహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన జేడీయూ నేత నితీశ్ కుమార్ సీఎం పదవి నుంచి వైదొలగడంతో.. డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సమ్రాట్ చౌదరీ ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మంగళవారం నిర్వహించిన మీటింగ్​లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న సమ్రాట్ చౌదరీని ఎన్డీయే కూటమి తమ నాయకుడిగా ఎన్నుకుంది.  57 ఏండ్ల సమ్రాట్ చౌదరీ.. బిహార్​లో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నాయకుడు. ముంగేర్ జిల్లాలో 1968లో జన్మించారు. అతని తండ్రి శకుని చౌదరీ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి పార్వతీ దేవి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చిన సమ్రాట్.. అగ్రికల్చర్, స్పోర్ట్స్, ఆర్థిక, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. గతంలో ఆర్జేడీ, జేడీయూలో పనిచేసి.. 2014లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. 2023 నుంచి 2024 వరకు బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. సమ్రాట్ చౌదరీని సీఎంగా ఎంపిక చేయడం వెనుక బలమైన సామాజిక సమీకరణాలు ఉన్నాయి. అతడు బిహార్‌‌లో రాజకీయంగా బలమైన కుష్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. యాదవుల తర్వాత ఓబీసీలలో వీరిదే అతిపెద్ద ఓటు బ్యాంక్. కుర్మీ సామాజిక వర్గానికి నితీశ్ కుమార్ తర్వాత రాష్ట్రంలో పట్టు సాధించాలంటే, బలమైన ఓబీసీ నాయకత్వం అవసరమని బీజేపీ భావించింది. ఈ కారణంతోనే సమ్రాట్ చౌదరీని సీఎంగా ఎంపిక చేసింది.

నితీశ్ కుమార్​​ రాజీనామా

బిహార్​ సీఎం పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. పాట్నాలోని లోక్​భవన్​కు చేరుకొని గవర్నర్​కు తన రిజైన్ ​లెటర్ సమర్పించారు. రాజీనామాకు ముందు ఆయన తన చివరి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, మంత్రి మండలిని రద్దు చేస్తున్నట్టు సహచరులకు వివరించారు. నితీశ్.. 1974లో జనతా పార్టీలో ఒక కార్యకర్తగాతన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 50 ఏండ్లకు పైగా బిహార్ రాజకీయాలను శాసించారు.