మధ్యప్రదేశ్ లో అంచనాలకు మించి సీట్లు సాధించిన బీజేపీ

మధ్యప్రదేశ్ లో అంచనాలకు మించి సీట్లు సాధించిన బీజేపీ

మధ్యప్రదేశ్​ లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ స్థానాలతో అధికారం రాబోతుంది. మొత్తం 230 అసెంబ్లీ  ఉన్నాయి.  ఇందులో 116 స్థానాలు గెలుచుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సగమం అవుతుంది. కానీ బీజేపీ ( సాయంత్రం 7 గంటలకు) 163 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే.. కాంగ్రెస్ 66, ఇతరులు 1 స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దీనిని బట్టి బీజేపీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా.. బీజేపీ 109 కే పరిమితం అయింది. స్వల్ప సీట్ల తేడాతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. ఈసారి ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీకి క్లియర్‌గా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

 మ‌ధ్యప్రదేశ్ లో స్పష్టమైన అధిక్యంతో ముందుకు సాగుతున్న త‌రుణంలో మ‌ధ్యప్రదేశ్ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మ‌ధ్యప్రదేశ్ తో పాటు రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ గ‌ఢ్ లో కూడా బీజేపీ గెలుపు దిశ‌గా ముందుకు సాగుతోంది. ప్రజల విశ్వాసం, కార్యకర్తల అంకితభావానికి నిదర్శనం' అని మధ్యప్రదేశ్ బీజేపీ ట్వీట్ చేసింది. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికే ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభించారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ పార్టీ కార్యకర్తలు అభినందించారు. 

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధనా సింగ్, ఇద్దరు కుమారులతో కలిసి తన అధికారిక నివాసం బాల్కనీ నుంచి విజయ చిహ్నాలను ప్రదర్శించారు.  బీజేపీ గెలుపు ప‌ట్ల ఆనందం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బీజేపీ భారీ ఆధిక్యం సాధించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతోషం వ్యక్తం చేస్తూ, 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుందని అన్నారు. కౌంటింగ్ కు ముందు ఏ పార్టీకి స్పష్టమైన గెలుపు అంచ‌నాల‌ను ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేక‌పోయాయి. అయితే, ఇప్పుడు వ‌స్తున్న ఫ‌లితాలు గ‌మ‌నిస్తే 160కి పైగా స్థానాల్లో బీజేపీ అధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.  2018తో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో 160 స్థానాల్లో ఆధిక్యం సాధించిన బీజేపీకి 51 సీట్లు అనూహ్యంగా పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక్కడ ప్రధాని మోదీ స‌హా ప‌లు కీల‌క నేత‌లు ఎన్నిక‌ల ప్రచారం నిర్వహించారు