న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని బీజేపీ ఎంపీలక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్‌కు ట్రాన్స్ఫర్ అయ్యేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కర్నాటక సీఎం ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ పిలవలేదని చెప్పారు. బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి వస్తుందంటూ స్వయంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌లకు రూ.4,400 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. స్మార్ట్ సిటీలలో భాగంగా వరంగల్, కరీంనగర్ రూ.1,000 కోట్లు, ఇతర పథకాలకు సహకారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో ఒక్కో యూనిట్లో లక్షా 50 వేల రూపాయలు కేంద్రానివే అని వెల్లడించారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించిన కేసీఆర్ ఇంతవరకు ఒక్క రూపాయీ విడుదల చేయలేదన్నారు. రైతులను ఆదుకునేలా కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా యోజన స్కీంను రాష్ట్రంలో అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు.
నెల రోజుల పాటు మహా సంపర్క్ అభియాన్
రాష్ట్రంలో ప్రతి ఊరికి బీజేపిని చేర్చేలా ‘మహా సంపర్క్ అభియాన్’ను చేపట్టబోతున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. మే 30 నుంచి జూన్ 30 వరకు దాదాపు నెల రోజులు రాష్ట్రాల వారీగా అభివృద్ధి రిపోర్టులు రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 303 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ‘ధన్యవాద్ మోడీ’పేరుతో ఓబీసీ సమ్మేళన సదస్సులు నిర్వహించాలని ఓబీసీ మోర్చా నిర్ణయం తీసుకుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసేది దర్యాప్తు సంస్థలే అని స్పష్టం చేశారు. గతంలో ప్రధాని హోదాలోనే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ ప్రారంభోత్సవాలు చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. మోడీ మీద ఉన్న ఆక్రోశంతోనే విపక్షాలు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ వేడుకలను బాయికాట్ చేస్తున్నాయని విమర్శించారు.
కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి: పరశురామ్
పార్లమెంట్ కొత్త బిల్డింగ్‌కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ కోరారు. బుధవారం ఢిల్లీలో ఎంపీ లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అంబేద్కర్ ఖ్యాతి నలుదిశల చాటేలా నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలన్నారు. తమ విజ్ఞప్తిపై లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారని, ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
