ప్రేమించిన యువతికి బైక్ నేర్పించే క్రమంలో ప్రమాద వశాత్తు ఇద్దరూ ఎస్సారెస్పీ కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. 2026 మార్చి 26న జరిగిన ఈ ఘటనలో ఇద్దరూ కొట్టుకుపోయారు. ఘటన జరిగిన మరుసటి యువకుడు అంకుష్ మృతదేహం లభ్యం అయినా.. యువతి లావణ్య మృతదేహం కోసం ఇవాళ్టి (మార్చి 31) వరకు గాలింపు చర్యలు కొనసాగుతూనే వచ్చాయి. ఎట్టకేలకు లావణ్య మృతదేహం లభ్యం అయ్యింది.
ఐదు రోజుల క్రితం మెట్ పల్లి మండలం పెద్దాపూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్ లో గల్లంతైన యువతి లావణ్య మృతదేహాన్ని సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ శివారులో గుర్తించారు పోలీసులు. ప్రేమికుడు అంకుష్ తో కలిసి బైక్ నేర్చుకుంటుండగా వెళ్తుండగా ఇద్దరూ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. యువతి మృతదేహం దొరకకపోవడంతో ఆ కుటుంబం ఆకలి దప్పిక మరిచి విషాదంలో మునిగిపోయింది. ఎట్టకేలకు పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.
SRSP కెనాల్ లో లావణ్య, అంకుష్ లు గల్లంతైన రోజు నుంచీ పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు కోరుట్ల సీఐ సురేష్ బాబు. గురువారం ( మార్చి 26 ) గల్లంతైన జంట కోసం పోలీసు బృందాలతో పాటు కుటుంబసభ్యులు కూడా నిర్విరామంగా గాలిస్తూనే వచ్చారు. చివరికి రేచపల్లి గ్రామ శివారులో మృతదేహం లభ్యం అయ్యింది. పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
