బిహార్‌‌లో ఎన్నికల హడావుడి.. పొత్తులపై బీజేపీ కసరత్తు

బిహార్‌‌లో ఎన్నికల హడావుడి.. పొత్తులపై బీజేపీ కసరత్తు

పాట్నా: బిహార్‌‌లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. కరోనా కారణంగా చాలా జాగ్రత్తల మధ్య ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఓటర్లకు ఫేస్‌ మాస్కు, హ్యాండ్ గ్లోవ్స్‌ను అందుబాటులో ఉంచనున్న ఈసీ.. అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది. ఇలా విభిన్న వాతావణం నడుమ బిహార్ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. మిగతా పార్టీలతో పొత్తుపై బీజేపీ దృష్టి పెట్టింది. అందుకోసం ఏర్పాటు చేసిన రెండ్రోజుల స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో భాగంగా పార్టీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ బిహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్, స్టేట్ ఇన్‌చార్జ్ భూపేంద్ర యాదవ్‌లు సీఎం నితీశ్ కుమార్‌‌తోపాటు జనతా దళ్ (యునైటెడ్) టాప్ లీడర్లు సంప్రదింపులు జరపనున్నారు.

ఫిఫ్టీ–ఫిఫ్టీ పాలసీతో ముందుకు?
అధికార నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్‌డీఏ) కూటమిలోని భాగస్వాములతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అలాగే సీట్ల కేటాయింపుపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీట్ల పంపకంపై ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాల కసరత్తుపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారని సమాచారం. కూటమిలోని మిగతా పార్టీలకు సీట్లు కేటాయించాక.. మెజారిటీ సీట్లను గతేడాది లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే బీజేపీ–జేడీ (యూ) 50–50 ప్రాతిపదికన పంచుకుంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బిహార్‌‌లో అక్టోబర్–నవంబర్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.